జార్ఖండ్ మరోమారు తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం వేకువజామున సైనికులకు, మావోయిస్టులకు మధ్య పెద్దఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో 12 మంది మావోయిస్టులు మరణించారు. మరికొంతమంది మావోలు పారిపోయారు. జార్ఖండ్ లోని ఓ గ్రామ అటవీ ప్రాంతంలో మావోలు సమావేశమవుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. దీంతో పరస్పరం జరిగిన ఎదురు కాల్పులలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. గాయాలపాలైన మరికొందరు మావోలు పారిపోయారు. కాగా, ఘటనా స్థలంలో పోలీసులు వారి దగ్గరికంటే అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకోవటం విశేషం. ఈ మధ్య కాలంలో మావోయిస్టుల దుశ్చర్యలు అసోం, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. గాలింపు కోసం వెళ్లుతున్న సైనికులు, పోలీసులపై విరుచుకుపడి వారిని మట్టుపెడుతున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు ఈ భారీ ఎన్ కౌంటర్ ప్రతీకారంగా భావించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.