ఓపక్క 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అంటూ పేపర్లలో ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది చేసే దారుణాలతో మొత్తం పోలీస్ వ్యవస్థకు మచ్చ వచ్చి పడుతుంది. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ అబలలపై పోలీసులు తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. అంతా చూస్తుండగానే అకృత్యానికి పాల్పడ్డారు. రాయడానికి వీలులేని భాషలో వారిని హింసించారు.
వివరాల్లోకి వెళితే...నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ అయిన బాధితురాలు తన ఆరుగురు స్నేహితులతో (ఒక యువతి, ఐదుగురు యువకులు) కలిసి ఓ హోటల్ కు వెళ్లింది. ఈ పార్టీలో ఇద్దరు మహిళలూ తప్ప మిగిలిన వారంతా మద్యం తాగారు. మోతాదుకి మించి తాగిన ఓ యువకుడు అభ్యంతరకరంగా వ్యవహరించడంతో అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడ్ని దేవగిరి కాలనీ ప్రాంతంలో వదిలి పెట్టి, ఆ ఇద్దరు మహిళలను వారివారి ఇళ్ల దగ్గర దింపేందుకు మిగతా స్నేహితులంతా వెళ్లారు. వారిని దించి వెనుదిరిగే సమయంలో వారంతా సెంట్రల్ బస్టాండ్ దగ్గరకెళ్లగా, అక్కడ దేవగిరి కాలనీలో దించేసిన యువకుడు ఎదురుపడ్డాడు.
పార్టీ మొత్తాన్ని పాడుచేశాడని ఆరోపిస్తూ అతడిని వారంతా కలసి కొట్టారు. ఆ క్రమంలో అతను పరుగెడుతూ కిందపడ్డాడు. దాంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందారు. దీనికి సీసీటీవీ పుటేజ్ సాక్ష్యం కూడా ఉంది. అయితే దీనిపై విచారణ పేరుతో ఇద్దరు మహిళలను ఎస్సై గణేష్ ఢొక్రాట్, మరో మహిళా ఎస్సై స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆపై వారికి నరకం చూపించారు. ఓ మగ ఎస్సై సూచన మేరుకు లేడీ ఎస్సై వారిని వివస్త్రలను చేసిందట. అక్కడ కానిస్టేబుళ్లు అంతా చూస్తుండగానే కొట్టడంతోపాటు వారికి మర్మాంగాల్లో కారం చల్లారుట. వ్యక్తి మృతిలో సంబంధం లేదని చెబుతున్నా వినకుండా బలవంతాన వాంగ్మూలం తీసుకుని సాయంత్రం విడిచిపెట్టారు. దీంతో బాధిత మహిళల్లో ఓ యువతి (21) తన తల్లితో కలిసి పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమీషనర్ డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించారు.