మహిళా చైతన్యం అన్నది ప్రభుత్వాలు చెప్పకపోయినా వస్తుందనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. గాడ్స్ ఓన్ కంట్రీగా గుర్తింపు పొందిన కేరళలో ప్రస్తుతం మంచినీటికి కటకటలాడే గ్రామాలున్నాయి. అపారమైన నీటి వనరులున్నప్పటికీ తీవ్ర నీటి కోరతతో అలాల్లాడిపోతున్నాయి. అయితే ఎవరో వస్తారని ఏదో చూస్తారని అక్కడి మహిళలు అనుకోలేదు. మహిళలే అయినప్పటికీ పలుగు, పార పట్టి చకచకా బావులు తవ్వేస్తున్నారు. 20 మంది కలిసి ఓ గ్రూప్ గా తయారయ్యారు. అంతేనా ఏకంగా 100 బావులు తవ్విపారేశారు. కేరళలోని మళప్పురం జిల్లాలోని కలికావు గ్రామంలోని మహిళలు తమ సత్తా చాటుతూ నీటి కరువును తీర్చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక్కరోజులో ఒక బావిని తవ్వేస్తారు. ప్రమాదంతో కూడుకున్న పనులు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా సాయం అందించాల్సిందిగా ఆ మహిళలు కొరుతున్నారు. ఓ వైపు ఉపాధితోపాటు తమ గ్రామానికి సేవ చేస్తున్నామని వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.