అభాగ్యులైన ఆడవారిని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతిపై (22) గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆ యువతి వివాహిత. భర్తతో వివాదాల కారణంగా వేరుగా ఉంటోంది. రెండేళ్ల క్రితం గుర్ గావ్ కి వచ్చిన ఆమె తన కొడుకు ను పోషించుకోవటం కోసం చిన్నా చితకా పనులు చేస్తూ నెట్టుకోస్తోంది. అయితే రాను రాను పోషణా భారం కావటంతో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతలో నిందితుల్లోని ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఉద్యోగం సాకుతో కార్యాలయానికి తీసుకు వెళుతున్నానని చెప్పి, మంగళవారం ఓ గెస్ట్ హౌజ్ కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మాటు వేసిన తన ఆరుగురి స్నేహితులతో ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.