కార్లు, స్కూటర్లు ఉంటే ఎంతో సుఖం. నిజమే! కాని, వాటికి సంబంధించిన పాలసీ విషయంలో కొంచెం నిర్లక్షం వహిస్తే చాలు అంతే సంగతులు. చాలాన్ రూపంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ద్విచక్ర వాహనదారులకు పాలసీ రెన్యువల్ ఓ పెద్ద పని. వారికి ఇప్పుడా సమస్య కొంతవరకు తొలగునుంది. ఎందుకంటే ఇక మూడేళ్లకోసారి వారు తమ వాహనానికి బీమా తీసుకుంటే సరిపోతుంది. ఈ సరికొత్త దీర్ఘకాలిక కాంప్రిహెన్సివ్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఇటీవలే ‘న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ’కి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ అనుమతినిచ్చింది. ఇంకా సంతోషించదగ్గ అంశమేమిటంటే ఇటువంటి పాలసీలపై ఏకంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందట. ఇలాంటి పథకాల వల్ల బీమా కంపెనీలకు పాలనా పరమైన ఖర్చులు చాలావరకూ తగ్గుతాయి. ఈ పాలసీని అతిత్వరలో ప్రారంభించే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన ప్రయోజనమేంటంటే పాలసీ మధ్యలో ఉండగా బీమా కంపెనీ ప్రీమియం ధరలను సవరించలేదు. ఒక వేళ సవరించినా కూడా మూడేళ్ళు అదే (పాత) ప్రీమియం కొనసాగుతుంది. అదీ విషయం. ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో వేచి చూడాలి మరి!