ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బిజిబిజీగా గడిపారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి- సీఎంల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకి సంబంధించి సమస్యలుంటే ఆంధ్రాతో పరిష్కరించుకోవాలని కేసీఆర్‌కు ఉమాభారతి సూచించారు. అవసరమైతే ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అంతేకాదు ఆంధ్రాతో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో తనకు ఎలాంటి విభేదాలులేవని, ప్రధానితో సమావేశం సమయంలో ఆయన పక్కనే కూర్చొని భోజనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సమాచారం.