మనం చనిపోతే ఎవరికి లాభం? శాస్త్రిగారూ, బోసుబాబూ ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా వేసుకునే అగత్యం దాపురించి ఉంటుందా? కర్మయోగుల దృష్టిలో ఇవి అప్రధానమైన అంశాలు. లబ్ధిదారులకు మాత్రం జీవన్మరణ సమస్య. నయం.. శాస్త్రిగారి భౌతికకాయమైనా దక్కింది. నేతాజీని సింపుల్ గా గాల్లో కలిపేసి మాయం చేశారు. గాంధీగారి పార్థివ దేహాన్ని చూడ్డానికి వచ్చేడని, ఆశ్రమవాసిగా ఉన్నాడని, సైబీరియా జైల్లో ఉండగా చూశామని, నేతాజీ విషయంలో పలురకాల వదంతులు వినిపించాయి. కానీ, దానికి కేంద్రం అనుమతి ఇంకా లభించకపాయే. కానీ, వరుసబెట్టి వస్తున్న నేతల మరణాలపై వివరణలు ఇప్పుడు కలకలం సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాల కుదేలుపై ఇవి తక్కువ ప్రభావం చూపిన సమీప భవిష్యత్ లో అది తప్పదనే చెప్పాలి. ముందు బోస్, తర్వాత శాస్త్రి ఇప్పుడు భగత్ సింగ్. ఈ క్యూ కి ఇంకా అంతు పొంతు ఉండదనే చెప్పాలి.
అసలు మర్మం ఎక్కడ దాగుంది. అధికార వ్యామోహం, కుళ్లు కుతంత్రాలు ఇప్పటి రాజకీయాల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. అప్పట్లో అవేం ఉండేవి కావు అనే భ్రమ ఇప్పటికీ మనలో చాలానే ఉంది. కానీ, రాజకీయాల్లో ఆత్మహత్యల కంటే హత్యలే ఎక్కువగా జరిగాయని, అవి కూడా ఆ టైంలోనే అనేది ఎవరూ జీర్ణించుకోలేని నిజం. ఆ మహనుభావుల పట్ల ఉన్న గౌరవం మనచేత అలా ఆలోచించేలా చేసి ఉండొచ్చు. కానీ, మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న రూల్ ప్రకారం వారి మరణాల వెనుక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రాజకీయాలే కారణమై ఉండొచ్చు. అయినా ఎవరూ పెదవి మెదపలేదు, మెదపరు కూడా. తీరా ఇప్పుడు ఏదో ఘనతలా ఆరా తీస్తుంటారు. విష ప్రయోగం, విమాన ప్రమాదం, అధికారిక ఉరి కారణాలేవైనా మనకు అనవసరం. అజాత శత్రువులుగా మెదిలారనుకున్న వారి మరణ మర్మం వెనుక కుట్రలు ఉండటం కామనే. అయినా చచ్చేదెవరు? చంపెదెవరు? అంటూ భవద్గీత శ్లోకాలను వల్లేసుకోవటం తప్ప మనం చేసేది ఏం ఉండదు.