పొగతాగుట ఆరోగ్యానికే కాదు... జేబుకూ హానికరం

January 14, 2015 | 10:58 AM | 28 Views
ప్రింట్ కామెంట్

ఇకపై సింగిల్ టీ తాగి ఒక సిగరెట్టు అంటించి ఆస్వాదిద్దామంటే కుదరదు. ధూమపానాన్ని నిరుత్సాహపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా కేంద్రప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించనుంది. పొగతాగే అలవాటున్న వారు ఇకపై దమ్ము కొట్టాలంటే చచ్చినట్టు ప్యాకెట్ కొనాల్సిందే. అలాగే బహిరంగ ధూమపానాన్ని నిషేదించేందుకు నియమాలను కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే రూ. 1000 ఫైన్ విధించింది. అంతేకాదు 18 ఏళ్లకు పైబడిన వారికే పొగాకు ఉత్పత్తులు అమ్మాలనే నిబంధనను 21 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీన్ని భవిష్యత్తులో 23 ఏళ్లకు, తర్వాతి దశలో 25 ఏళ్లకు పెంచనుందట. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (సవరణ) బిల్లు - 2015 ముసాయిదాను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆన్ లైన్ లో ఉంచింది. అంతేకాదు దీని అమలుకు స్వయంప్రత్తిగల జాతీయ పొగాకు నియంత్రణ సంస్థను ఏర్పుటు చేయనుంది. అలాగే చట్టాలను ఉల్లంఘించే విక్రయదారులపై కొరడా ఝులిపించనుంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేపడితే రూ. లక్ష రూపాలయల దాకా జరిమానా విధిస్తారట. అంతేకాదు ఈ నిర్ణయంతో హుక్కా బార్లు మూతపడనున్నాయి. చట్ట సవరణ కోసం వేసిన కమిటీ సిఫారసులపై గతంలో పొగాకు రైతు సంఘాలు, సిగరెట్ పరిశ్రమ లాబీల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. దాంతో చట్ట సవరణకు కేంద్రం వెనుకాడుతోందనే వార్తలు వచ్చాయి. అయితే మోదీ సర్కారు మాత్రం ప్రజారోగ్యానికే పెద్దపీట వేసింది. పొగాకు ఉత్పత్తుల మూలంగా వాటిల్లే ముప్పు నుంచి భావి తరాలను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ