అస్సాంలో బోడో ఉగ్రవాదులు దాదాపు 55 మంది ఆదివాసీలను ఊచకోత కోశారు. దీంతో స్థానికంగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. రిజర్వ్-డ్ ఫారెస్ట్ ఏరియాల్లోని ఆయుధాలతో దాడిచేసి, మహిళలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. బోడో తీవ్రవాదుల నరమేధంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటనా స్థలాలకు చేరుకున్న భద్రతా దళాలు తీవ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు నిలిపివేయకపోతే ప్రతీకార దాడులకు దిగుతామని సోమవారమే ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు దాడులు జరిగిన ప్రాంతాలన్నీ ఇండో-భూటాన్ సరిహద్దులోనివని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షిస్తున్నారు.