పెళ్లంటే పచ్చని పందిర్లు, కమ్మటి విందు భోజనాలు, అతిథి మర్యాదలు ఎంత ముఖ్యమో, బ్యాండ్లు, బారాత్, తీన్మార్ డాన్సులు అంతే ముఖ్యం. పూట గడవని వారుకూడా పెళ్లిళ్ల విషయంలో మాత్రం అప్పు చేసైనా ఆర్భాటంగా చేయటం, ఆపై ఇలాంటి వేడుకను నిర్వహించిన మన దేశంలో సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా యూత్ తప్పతాగినప్పటికీ తమ చిందులతో అక్కడున్నవారిని అలరించటం ప్రతీ పెళ్లిలోనూ ఆనవాయితీగా మారింది. అయితే ఇలాంటివి అనవసర ఖర్చులే తప్ప ఒరిగేదేం లేదని ఇస్లామిక్ చట్టాలు చెబుతున్నాయంట. అందుకే దుబారాకు దూరంగా ఉండాలని చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ కు చెందిన ఇస్లామిక్ మత గురువులు ఇటీవల పలు కీలక తీర్మానాలు చేశారు. ఇకపై జరిగే ముస్లిం పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలను వాడరాదన్నది అందులో ఓ తీర్మానం. అంతేకాక ఇప్పటిదాకా వారి పెళ్లిళ్లలో వేడుకగా జరుగుతున్న గానా బజానాకు కూడా వీడ్కోలు పలకాల్సిందేనని కూడా వారు చెబుతున్నారు. ఇటీవల సమావేశమైన అక్కడి మతగురువులు పెళ్లిళ్లలో దుబారాకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా అమల్లోకి రాని ఈ తీర్మానాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే. బ్యాండ్ బాజా, గానా బజానాలు లేక చప్పగా సాగనున్న ముస్లిం పెళ్లిళ్లు దర్శనమివ్వనున్నాయన్న మాట.