జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకునేలా కనిపించటం లేదు. ఇందులో భాగంగా తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు అంశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాదు బీజేపీ ముఖ్య నేతలు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో బుధవారం చర్చలు జరిపారు. మొత్తం 87 స్థానాలున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. పీడీపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెబెల్స్ గా పోటీచేసి గెలిచిన ఆరుగురు ఎవరికైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, రెబెల్స్ కలిస్తే... ఈ బలం 46కు చేరుకుంటుంది. ఈ లెక్కన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు జమ్ముకు పంపింది. అక్కడ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నికకు వీరు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ము కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ వారణాసి రాం మాధవ్ తెలిపారు.