జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం లాంఛనప్రాయంగా ఉంది. మొత్తం 81 స్థానాలకుగానూ 33 స్థానాలలో బీజేపీ సీట్లను కైవసం చేసుకోగా, మరో పది స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయంపై స్తబ్ధత నెలకొంది. అసలు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల పోరులోకి దిగింది. గతంలో కూడా ఇలా మహారాష్ట్ర, హార్యానా ఎన్నికల సమయంలో కూడా బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ ఆదివాసీలే సీఎంలుగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఈసారి ముఖ్యమంత్రి ఎవరవుతారా అన్న ఆసక్తి నెలకొంది. అర్జున్ ముండా సీనియర్ గా రేసులో ఉన్నప్పటికీ ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రేసు నుంచి వైదోలగినట్టే. మరోవైపు మహారాష్ట్ర, హార్యానాలో సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వారినే సీఎంలుగా ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడా అదే వైఖరిని బీజేపీ అనుసరించవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.