జమ్ము కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జమ్ము కశ్మీర్‌లో 87, జార్ఖండ్‌లో 81 స్థానాల్లో ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతునున్నాయి. ఊహించినట్టుగానే బీజేపీ తన జోరును చూపిస్తోంది అని అనుకుంటుండగానే తాజా ఫలితాలు కాస్తా టెన్షన్ పెడుతున్నాయి. జార్ఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ వస్తుందనుకుంటున్న బీజేపీకి ప్రస్తుత ఫలితంతో కొంత ఆందోళన చెందుతుంది. అక్కడ మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం బీజేపీ 32 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా.. జేఎంఎం 23 స్థానాల్లోను, కాంగ్రెస్ 5 స్థానాల్లోను, జేవీఎం 7 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. జమ్ము కశ్మీర్ లో మాత్రం స్పష్టంగా హంగ్ దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. జమ్ము కశ్మీర్ లో 87 సీట్లున్న శాసనసభకు ఐదు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అయితే అక్కడ బీజేపీ మాత్రం అంచనాలను మించి కొంత ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం పీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది. మరోవైపు పీడీపీతో పొత్తుకోసం కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ హంగ్ అనివార్యమైతే.. పీడీపీకి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానందే తుది నిర్ణయమని ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ప్రస్తుతం 71 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు తెలుస్తున్నాయి. పీడీపీ, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లు తల ఓ సీటును గెలుచుకున్నాయి. కౌంటింగ్ లో ప్రస్తుతం 28 చోట్ల పీడీపీ, 24 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 12, కాంగ్రెస్ 14 ఆధిక్యంలో ఉన్నాయి.