అజంఘర్ ఎంపీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదట. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా ఆయన్ను తన నియోజకవర్గానికి తీసుకురావాలని బీజేపీ ఓ ప్రకటన చేసింది. తీసుకొచ్చిన వారిని తగిన నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించింది. బీజేపీ మైనారిటీ వింగ్ చేస్తున్న ఈ ప్రచారం అజంఘర్ ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేపుతోంది. సఘ్రీ తెహసిల్, చుట్టుపక్కల ప్రాంతాలలో పోస్టర్లను అంటించామని, ములాయంను ఆజంఘర్ కు తీసుకొచ్చిన ఎవరికైనా నగదు అందజేస్తామని కూడా ప్రకటించామని బీజేపీ మైనారిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు సోఫియా ఖాన్ చెప్పారు. వారణాసికి అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి అయిన నరేంద్రమోదీ ఒయటి వ్యక్తని ఎన్నికల సమయంలో ములాయం వ్యాఖ్యానించారు. కానీ, గెలిచాక ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన మూడుసార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు అని ఖాన్ అన్నారు. ఓ ఎంపీ అయిన ములాయం తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకునేందుకు సమయమే కేటాయించడం లేదని ఆయన ఆరోపించారు. అసలు ఆయన ఇప్పుడో బయటి వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో మణిపురి, అజంఘర్ స్థానాలకు పోటీచేసిన ములాయం సింగ్ రెండింట్లో విజయం సాధించారు. తరువాత మణిపురి స్థానానికి రాజీనామా చేసి అజంఘర్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.