రజనీకాంత్ ను బీజేపీలోకి లాగాలన్న ప్రయత్నాలకు కమలనాథులు స్వస్తి పలికారు. మీనమేషాలు లెక్కించేవారితో పార్టీకి ప్రయోజనం ఉండదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అన్నాడీఎంకేలో జయలలిత, డీఎంకేలో కరుణానిధి ప్రజాకర్షణ కలిగిన నేతలుగా ఉన్నారు. రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రావాలంటే అటువంటి నేత అవసరమని భావించిన కమలనాధుల కళ్లలో రజనీకాంత్ పడ్డారు. తమిళనాట తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన అన్నిపార్టీలు బలపడాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం రజనీ నామస్మరణం చేశారు. ఎందుకంటే ఎంజీఆర్ తర్వాత ప్రజల్లో అంతటి ఆదరణ ఉంది రజనీకే కాబట్టి. ఆఖరికి బెంగళూరులో లింగ షూటింగ్‌లో ఉన్న రజనీకాంత్‌ను అక్కడి పార్టీ అగ్రనేత యడ్యూరప్ప కలిశారు. అమిత్‌షా స్వయంగా రజనీతో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సైతం రజనీని ఆయన ఇంటికి వద్ద కలిశారు. పార్టీలోకి వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి రజనీయే అని బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చేశారు. అయితే లింగ విడుదల వరకు ఆగాల్సిందిగా రజనీ వారికి చెప్పాడట. మరోవైపు ఇదే సమయంలో పార్టీలో చేరే విషయమై అభిమాన సంఘాల అభిప్రాయాలు సేకరించాలని తన సోదరుడిని పురమాయించారట. దీంతో రజనీ ఇక బీజేపీలో చేరడం ఖాయమైనట్లేనని అంతా సంబరపడిపోయారు. ఈ సమయంలో జయ బెయిల్‌పై బయటకు రాగానే రజనీకాంత్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడంతో కంగుతినటం కమలనాథుల వంతు అయ్యింది. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రజనీ అంశాన్ని సైతం చర్చించారు. చెన్నైకి రాకముందే పార్టీలో చేరే విషయమై నిర్ణయం ప్రకటించాలని రజనీని కోరారట. దీనికి రజనీ నాలుగు నెలలు ఓపిక పట్టండి సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విషయమేమిటంటే ఈ నాలుగు నెలల్లో జయలలిత అక్రమాస్తుల కేసు వ్యవహా రం ఒక కొలిక్కి వస్తుంది అప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని రజనీ ఫ్లాన్. ఈ సమాధానం నచ్చని అమిత్ షా గడువు తీసుకునే విషయాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీలోకి ఎవరూ రావాల్సిన అవసరం లేదని అమిత్ షా రాష్ట్ర నేతలతో వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షులే రజనీ కోరికను పక్కన పెట్టడంతో బీజేపీలోకి సూపర్‌స్టార్ ఎంట్రీ లేనట్లేనని తెలుస్తోంది. దీంతో ఇకపై రజనీతో ఎలాంటి మంతనాలు జరపోద్దని బలంగా నిర్ణయించుకున్నారట. రాజకీయాల్లోకి రాకముందే రజనీ పాలి‘ట్రిక్స్’ ప్లే చేస్తుండటం ఇప్పుడు తమిళనాట ప్రధాన చర్చగా మారింది.