ఆ బుడతడి వయసు కేవలం నాలుగేళ్లు. పొరపాటున పాకిస్తాన్ సరిహద్దులు దాటి భారత్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. సైన్యం కంట పడ్డాడు. అదే కాస్త వయసు ఎక్కువ వుంటే కఠిన శిక్షలు, విచారణను ఎదుర్కొని ఉండేవాడు. కాని, సింధీ భాష తప్ప మరోటి తెలియని చిన్నారి. వీడి పేరు అలీ గోహార్. విఘా కోట్-గుజరాత్ సరిహద్దుల్లో చలితో వణుకుతూ దిక్కుతోచక బిత్తర చూపులు చూస్తున్న వీడిని, విధినిర్వహణలో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్లు చేరదీసి, ఆకలి తీర్చారు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చారు. ఆపై పాక్ సైన్యానికి సమాచారం అందించి, వారితో ఫ్లాగ్ సమావేశం నిర్వహించి, పిల్లాడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు. భుజ్ రేంజ్ బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ హిమాంశు గౌర్ ఈ విషయాలను వెల్లడించారు. భారత జవాన్లు ప్రదర్శించిన మానవతా దృక్ఫదానికి పాక్ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరి పాక్ సైన్యానికి మనవాళ్లకున్నంత సహృదయాలు ఉన్నాయంటారా?