ఏదైనా ఒక పనిని సాధించాలంటే దానిపై ఏకాగ్రత అవసరం. అప్పుడే లక్ష్యాన్ని మిస్సవ్వకుండా సాధిస్తామట. మరి ఏకాగ్రతకు సాధించే ఏకైక మార్గం యోగానే కదా. దీనిని కాస్త లేటుగా గుర్తించినట్లుంది భారత ఆర్చరీ కమిటీ. అందుకే ఆటగాళ్లకు ఏకాగ్రతను ప్రసాదించేందుకు ఓ ప్రముఖ యోగా గురువు ఆశ్రయించింది. ఆయన ఎవరో కాదు... బాబా రాందేవ్... ఆయన ఆధ్వర్యంలో భారత అర్చరీ క్రీడాకారులకు యోగా తరగతులు ఇప్పించాలని ఆర్చరీ అసోషియేషన్ నిర్ణయించింది. ఇందుకోసం రాందేవ్ ను కలిసి యోగా తరగతులు నిర్వహించాలని అసోషియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా కోరారట. వచ్చే ఏడాది రియోలో జరగనున్న ఒలంపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆర్చర్లు అన్నివిధాలా సిద్ధమయ్యేందుకుగానూ యోగా బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు మల్హోత్రా మాట్లాడుతూ... తీవ్రమైన పోటీల సమయంలో తమ ఆర్చర్లు మానసికంగా బలంగా ఉండాలంటే యోగా తప్పకుండా అవసరమని నిర్ణయించుకున్నామని చెప్పారు. దీంతో వచ్చే ఏడాది జరిగే రియో ఒలంపిక్స్ లో ఆర్చర్లు పతకాలు సాధించేందుకు ఇది బాగా సాయపడుతుందని పేర్కొన్నారు. మరి బాబా గారు బాణాల వీరులను ఏ రేంజ్ లో సాగదీస్తారో చూడాలి.