మధ్యప్రదేశ్ లో నీట మునిగిన రెండు రైళ్లు... 30 మంది మృతి

August 05, 2015 | 10:00 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Kamayani_Janata_Expressaccident_killed_30_harda_MP_niharonline

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒకే ట్రాక్ పై ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లకు ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఆ తర్వాత 11.45 గంటలకు అదే మార్గం మీదుగా వచ్చిన జనతా ఎక్స్‌ప్రెస్ సమాచారలోపంతో పట్టాలు తప్పింది. జనతా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 5 బోగీలు నదిలో పడిపోయాయి. జబల్‌పూర్‌ నుంచి ముంబయి వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ ఖిర్కియా- బిరంగి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా గాయపడ్డారు. మందికిమృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సంఘటనా స్ధలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘోర సంఘటన హర్దాకు 25 కిలో మీటర్ల దూరంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దాదాపు 300 మంది ప్రయాణికులను కాపాడారు. మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఈ ప్రమాదం మాచక్‌ నది దాటాక కల్వర్టు దగ్గర చోటుచేసుకుందని చెప్పారు. భారీవర్షాలకు కల్వర్టుపై రెండు ట్రాక్‌లు కుంగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో చాలామందిని రక్షించి, ఇటార్సీ రైల్వేస్టేషనుకు తరలించామని రైల్వేఅధికారులు వివరించారు. భారీవర్షాలకు పట్టాలు కొట్టుకుపోయి ప్రమాదాలు జరిగినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ ఎ.కె. మిత్తల్‌ చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రైల్వే శాఖ రూ. 50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లను నిలిపివేశారు. ముంబై, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు. ప్రమాదం సంభవించిన హర్దా వద్ద మూడు రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారి మళ్లించారు.

ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు.  భారీ వర్షాల కారణంగా వంతెనలు దెబ్బతిన్నాయని అన్నారు. వంతెనపై చేరిన వరద నీటి కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ