పెద్దల ఆశీర్వాదంతో జరిగిన పెళ్లిని పటాఫంచలు చేద్దామనుకున్న అతగాడి ఆలోచన బెడిసికొట్టింది. విడాకుల కోసం భార్యను నేరుగా అడిగే ధైర్యం లేక వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అంతేకాదు రెండో పెళ్లి చేసుకుందామనుకున్న అతగాడి ఫ్లాన్ భార్య అప్రమత్తతో ఫెయిల్ అయ్యింది. నీవెక్కడ ఉన్నావంటూ ఫోన్ చేసిన భార్యకు ఏకంగా తన ప్రేయసితో బెడ్ మీద ఉన్న ఫొటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపాడు.
బెంగళూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. నగరంలోని శ్యాంపురలో ఉంటున్న ఇబ్రహీం రిజ్వాన్, తహసీన్‌లకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఇబ్రహీం రిజ్వాన్‌కు స్థానికంగా ఉంటున్న మరో యువతితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇబ్రహీం రిజ్వాన్ ఇంటికి సరిగా వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే ఈనెల 19న తహసీన్ భర్తకు ఫోన్ చేసి ఎక్కడున్నావని ప్రశ్నించింది. నేను ఎక్కడున్నానో చూడు అంటూ ఆ యువతితో సన్నిహితంగా ఉంటున్న ఫొటోలను, వీడియోలను వాట్సప్‌లో భార్యకు పంపించాడు.
ఈ పరిణామంతో భయపడిన తహసీన్ తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి సదరు యువతి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఆ యువతితో ఇబ్రహీం రిజ్వాన్‌కు నిశ్చితార్థం జరుగుతోంది. దీంతో తహసీన్ తన భర్త, ఆ యువతితో వాగ్వాదానికి దిగడమే కాకుండా పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఇబ్రహీం తన ప్రేయసితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనను మోసం చేసి భర్త మరో యువతితో వివాహానికి సిద్ధమవుతున్నాడని తహసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అతగాడిని వెతికే పనిలో ఉన్నారు.