ఎట్టకేలకు మాఫియా డాన్ చోటా రాజన్ ఇండియన్ పోలీసులు తీసుకొచ్చేశారు. భారత్ కు పంపితే తనకు ప్రాణ హాని ఉందని గగ్గోలుపెట్టిన అతను చివరికి ఇండియాలో కాలు మోపక తప్పలేదు. ప్ర్యతేక విమానంలో ఇండోనేషియాలోని బాలి ఎయిర్ పోర్ట్ నుంచి అతన్ని భారీ భద్రత మధ్య ఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే విమానం ఎక్కేముందు, దిగాక అతను ఓవర్ యాక్షన్ చేశాడా అన్న సందేహాలు కలగక మానవు.
బాలి ఎయిర్ పోర్టులో విమానం ఎక్కే ముందు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐయామ్ వెరీ హ్యాపీ. చాలా కాలం తర్వాత మాతృభూమికి వెళుతున్నా’’ అని అతడు వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగాడనుకుంటే పెద్ద తప్పే, ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో దిగిన వెంటనే పెద్ద సినిమానే చూపించాడు. ఇంద్ర సినిమా లో చిరంజీవిలా నేలను ముద్దాడాడు. తద్వారా తాను నిజంగా దేశభక్తుడినేనని కలరింగ్ ఇచ్చేందుకు అతడు చేసిన యత్నాన్ని పలు వార్తా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.
అయితే అరెస్టైన సమయంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహాని ఉందని, భారత్ కు పంపిస్తే తనను చంపేస్తారని, వదిలేస్తే జింబాబ్వే కి పారిపోతానని పోలీసులను అతను వేడుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి చోటా చేసిన ఈ దేశ భక్తి చర్యను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో 20 ఏళ్లకు పైగా పోరు సాగిస్తున్న తాను నిజంగా దేశభక్తుడినేనని మాఫియా డాన్ చోటా రాజన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.