పూర్వకాలంలో పూటకుళ్ల ఇల్లు అటు తర్వాత వసతి గృహాలు ఆపై హస్టళ్లు, హోటళ్లు, లాడ్జీలంటూ సౌకర్యాల కోసం వచ్చేశాయి. ఎవరి స్తోమతకు తగ్గ రేంజ్ లో డబ్బులు చెల్లిస్తే ఆ రేంజ్ సదుపాయాలను కల్పిస్తూ వస్తున్నాయి. కానీ, మరణించేవారి కోసం వసతి గృహాలు మీరు ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి భవనం గురించే. వారాణాసిలో ముక్తి భవన్ అనే ఓ భవన సముదాయం మరణించే వారి కోసమే కేటాయించబడిన భవనం.
కాశీలో చనిపోతే ముక్తి, మోక్షం లభిస్తుందనే నమ్మకం హిందువుల్లో ఉంది. అందుకే చాలా మంది అవసానదశలో అక్కడికి చేరుకుని చివరిరోజులు గడుపుతారు. సాధారణంగా ఏ హోటల్ కైనా వెళ్లితే ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్న ఉంటుంది. కానీ, ఇక్కడ వెరైటీ. మీరు ఎన్ని రోజులు బతికి ఉంటారనే ప్రశ్న వస్తుంది. గది తీసుకన్న రెండువారాల్లో మీరు చనిపోవాలి. లేకపోతే బలవంతంగా గది ఖాళీ చేయించి వేరే వాళ్లకి కేటాయిస్తారు. వ్యాధులతో బాధపడేవారు, వృద్ధాప్యంతో ఉన్నవారు మాత్రమే ప్రశాంతంగా చనిపోవడానికి ఇక్కడికి వస్తుంటారని ముక్తి భవన్ మేనేజర్ భైరవ్ నాథ్ శుక్లా చెబుతున్నాడు. ఇక్కడ మొత్తం 12 గదులు, ఒక చిన్న గుడి, ఓ పూజారీ మాత్రమే ఉంటారని ఆయన తెలిపాడు.
ఏటా వేల మంది ఇక్కడికి వస్తుంటారని, మరణించాక వారి అంత్యక్రియలను తామే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ కనిపించే దృశ్యాలు మనిషి జీవితంలోని అంతిమ క్షణాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయట. వినేందుకు వింతగా, విషాదాంతంగా ఉన్నా ఇది మాత్రం నిజం.