ఢిల్లీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ప్రయత్నించి భంగపడ్డ ఆ నేత పార్టీకి చేటుచేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన సంజయ్ పూరీ అనే వ్యక్తి సీటు లభించకపోవటంతో ఆ కోపంలో పార్టీ వెబ్ సైట్ ను పనిచేయకుండా చేసి పడేశాడు. కాంగ్రెస్ కు చెందిన dpcc.co.in, congresssandesh.com వెబ్ సైట్లను పార్టీ తరపున నిర్వహిస్తున్న సంజయ్ ఢిల్లీ జనక్ పురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించాడు. చివరికి అతనికి టికెట్ కేటాయించకపోవటంతో ఆ బాధలో పార్టీ వెబ్ సైట్లకు సంబంధించిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సమాచారం మొత్తం ఎత్తుకెళ్లాడు. దీంతో వెబ్ సైట్లలో సమాచారం ఏదీ రావటం లేదు. మరో వైపు ఈ విషయమై సంజయ్ ను ఆరాతీస్తే తాను రూపొందించిన సైట్లను తాను తీసుకెళ్లటం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించాడు. కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ రెబెల్ గా తాను పోటీచేస్తానని తెలిపాడు.