భారత్ లో సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేదిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం 2011 లో కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలంతా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కమిటీ త్వరలో సుప్రీంకు నివేదికను ఇవ్వబోతుందట. ఇక ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలతో కూడిన కథనంను ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. ఇంట్లో పూట గడవక, కడుపేదరికంలో మగ్గుతూ పొట్టకూటికి పడక వృత్తిగా స్వీకరించడం చట్ట వ్యతిరేకం ఏమీ కాదని అయితే, వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రం తప్పేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సంచలన సిఫార్సులను చేయనుంది.
ఓ వ్యభిచార గృహంపై దాడి చేసినా, అక్కడ స్వీయ సమ్మతంతో వృత్తిలో ఉన్న వారిని అరెస్ట్ చేయరాదని, వారిపై జరిమానాలు వద్దని కూడా కమిటీ సూచించనున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా కేసుల్లో 1956 నాటి ఐటీపీఏ (ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టంలోని సెక్షన్ 8ను పోలీసులు అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం, సెక్స్ వర్కర్లు బహిరంగంగా విటులను ఆకర్షించే ప్రయత్నాలు చేయకూడదు. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 500 వరకూ జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
కాగా, సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ అధ్యక్షతన కమిటీ ఏర్పడగా, వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు సిఫార్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరిపైనైనా సెక్స్ వర్కర్లు కేసు పెడితే, దాన్ని కూడా ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని కూడా కమిటీ సూచించినట్టు సమాచారం. దేశంలో అధికారిక అంచనాల ప్రకారం 12 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారు.
కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఈ వృత్తిలో ఉన్నవారిని చట్ట వ్యతిరేకులుగా భావిస్తూ, పోలీసులు వేధించరాదని ఈ కమిటీ నివేదికలో సిఫార్సులు ఉన్నాయని ఆ పత్రిక కథనం సారాంశం.