కిడ్నాపర్లు భయపడటం మూలానో, లేదా మరే ఇతర కారణం మూలానో తృటిలో జీవితాన్ని నాశనం చేసే పెను ప్రమాదం ఆ యువతి తప్పించుకుంది. అంతకన్నా ముందు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించింది. బుధవారం రాత్రి నుంచి అదృశ్యమైన స్నాప్ డీల్ ఉద్యోగిన దీప్తీ సర్నా(24) ఉదంతం సుఖాంతం కాగా, ఆమె తన తల్లిదండ్రులను కలిసింది. అసలు తనకేమయింది? ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని స్వయంగా పోలీసులకు వెల్లడించింది.
ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్లేందుకు షేర్ ఆటోను ఎక్కానని అందులో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నారని చెప్పింది. తాను ఫోన్ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆటో దారి మళ్లడాన్ని గమనించి కేకలు పెట్టగా, వారు తనని అరవకుండా బంధించి, కిడ్నాప్ చేశారని చెప్పింది. తన కళ్లకు గంతలు కట్టారని చెప్పిన దీప్తి, వారు తనను ఎటువంటి శారీరక హింసకూ గురి చేయలేదని, మూడు నాలుగు గంటలు మాత్రం ప్రయాణం గుర్తుందని, ఆ సమయంలో తనకు నరకం కనిపించిందని చెప్పుకొచ్చింది.
ఆపై ఓ చోట ఆపి దించేశారని, తీరా చూస్తే తాను పానిపట్ రైల్వేస్టేషన్లో ఉన్నానని చెప్పింది. తన బ్యాగ్, సెల్ ఫోన్ మాత్రం వారు దొంగిలించినట్లు యువతి చెబుతోంది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి మాట్లాడానని, ఘజియాబాద్ కు బయలుదేరానని వివరించింది.
కాగా, దీప్తి అదృశ్యమైన తరువాత, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 200 మందిని రంగంలోకి దింపి విస్తృతంగా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏ హానీ జరగలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. ఆమె పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నదని, కోలుకున్నాక మరోసారి విచారిస్తామని తెలిపారు.