ఐఎస్ మూలాలు ఇండియాలో కూడానా?

December 16, 2015 | 11:40 AM | 2 Views
ప్రింట్ కామెంట్
dawood-gang-ISIS-kills-BJP-leaders-niharonline

ఉగ్రరాక్షసులు ఐఎస్ తీవ్రవాదుల జాడలు ఇండియాలో కనిపించాయా? అవుననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ నివేదిక. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో ఇటీవల ఇద్దరు బీజేపీ నేతలు హత్యకు గురయిన విషయం తెలిసిందే. బీజేపీ భరూచ్ జిల్లా మాజీ అధ్యక్షుడు శిరీష్ బంగాలీ, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రగ్నేశ్ మిస్త్రీలను ఉగ్రవాదులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో గుజరాత్ పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న డీ గ్యాంగే ఈ ఘాతుకానికి పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు గతవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యింది.

 

                                  కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఎన్ఐఏ అధికారులు బీజేపీ నేతల హత్యకు వినియోగించిన ఆయుధాలను సరఫరా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. సూరత్ కు చెందిన నాసిర్ పఠాన్ ఖాన్ అనే సదరు వ్యక్తిని విచారించిన సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆదేశాలతోనే బీజేపీ నేతల హత్యకు దావూద్ ఇబ్రహీం తన ముఖ్య అనుచరుడు చోటా షకీల్ కు ఆదేశాలు జారీ చేశాడు. చోటా షకీల్ పర్యవేక్షణలో డీ గ్యాంగ్ సభ్యుడు జావెద్ చిక్నా ఈ హత్యలు చేయించాడు. ఇటీవలే పోలీసులకు చిక్కిన చిక్నా కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. బీజేపీ నేతల హంతకులకు రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, సదరు మొత్తంలో హత్యకు ముందే రూ.5 లక్షలు కూడా హవాలా మార్గంలో చెల్లించేశామని చెప్పాడు. అంటే, డీ గ్యాంగ్ కూడా ఐఎస్ ఉగ్రవాదుల ఆదేశాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగిందన్న మాట. దీంతో ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. ఒకవేళ అదే నిజమైతే మరిన్నీ ఘోరాలకు వారు శ్రీకారం చుడతారన్నటంలో సందేహం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ