సోషల్ మీడియా మత్తులో పడిపోయిన నేటి యువత ఎదుటి వాడు చచ్చినా ఫర్లేదు కానీ వారి సరదా కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తమ చుట్టూ ఏం జరుగుతున్నా స్పందించడం మానేసి, వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి లైకులు, కామెంట్ల కోసం వెతుక్కుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ జరిగిన ఒక ఘటన యువతలో పెరిగిపోయిన పైత్యాన్ని తెలియజేస్తుంది.
జాన్ పూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ కి అయేషా అనే యువతితో వివాహమైంది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో అయేషా పుట్టింటికి చేరింది. ఆమెను ఒప్పించి కాపురానికి తీసుకెళ్దామని భావించిన ఫిరోజ్ కు చుక్కెదురైంది. ఆమె నుంచి ఆదరణ లభిస్తుందనుకుంటే తిరస్కారం ఎదురైంది. దీంతో ఫిరోజ్ ఆమె ఎదురుగా నడి రోడ్డు మీద నిలబడి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల వేడికి తాళలేక రక్షించమని వేడుకున్నాడు. ఈ తతంగం జరుగుతున్నప్పుడు అక్కడ గుమిగూడి ఉన్నవారు అతనిని వారించకపోగా, వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. అతను రక్షించమని అరుస్తున్నప్పుడు కొంత మంది స్పందించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.