లైంగిక దాడుల్లో న్యాయస్థానాల ఉదాసీనత వ్యవహార శైలిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఇక్కడ మరో ఉదంతం షాక్ కి గురిచేస్తోంది. తీవ్ర నేరాల్లో కూడా మైనర్లు అన్న ఒకే కారణంతో రాక్షసులను వదిలేసే పెద్ద మనస్సున్న మన కోర్టులు తాజాగా మరోసారి వారి దొడ్డ మనసును చాటుకున్నాయి. అత్యాచార కేసుల్లో శిక్షలు సరిపోవడం లేదని, మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ పెరుగుతున్న వేళ, రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని ఢిల్లీ కోర్టు ఏకంగా విడుదల చేసింది. అంతేకాదు బాధితురాలిపై అతను చేసిన లైంగిక దాడిని 'యవ్వనపు ఆత్రం'గా అభివర్ణించారు సదరు జడ్జిగారు.
వికూ బక్ష్ అనే వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆపై అత్యాచారం చేశాడని, వివాహం చేసుకోలేదని ఓ యువతి(24) ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలిగా, నిందితుడు తమ కోరికలను ఆపుకోలేక దగ్గరైనట్టు తెలుస్తోందని, దీన్ని అత్యాచారంగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ, వారిద్దరి మధ్యా సామాజిక మాధ్యమాల్లో కొనసాగిన సంభాషణలు పరిశీలిస్తే, ఆమె కూడా అతనితో లైంగిక బంధానికి ఆసక్తి చూపినట్టు స్పష్టమవుతోందని అన్నారు. కాగా, ఈ కేసులో వికూబక్ష్ పై ఐపీసీ 376, 506 కింద పోలీసులు కేసులు పెట్టారు. కేసు విచారించిన న్యాయస్థానం ఇద్దరూ తమ బంధాన్ని ఆనందించారని స్పష్టమవుతోందని, ఈ కేసులో నిందితుడిని తప్పుబట్టలేమని పేర్కొంటూ అతన్ని విడుదల చేసింది.