కోల్ కతాలో దివంగత సత్యజిత్ రే పేరిట నెలకొల్పబడ్డ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ అది. దేశంలోనే పేరున్న నట శిక్షణాలయాల్లో అది ఒకటి. అక్కడ నటనలో శిక్షణ తీసుకునేందుకు వచ్చిన యువతులపై కొందరు ప్రొఫెసర్లు దారుణాలకు ఒడిగట్టారు. వారిని లైంగికంగా వేధించారు. తనపై ప్రొఫెసర్ అత్యాచారం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదుతో మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది. మే 2014లో ప్రొఫెసర్ తనను బలవంతం చేశాడని ఓ యువతి గత నెలలో ఫిర్యాదు చేయగా, విచారణ ప్రారంభించిన పోలీసులకు మరిన్ని నిజాలు తెలిశాయి. ఇక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్లలో నలుగురు తమను లైంగికంగా వేధించారని పలువురు యువతులు, పోలీసుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఇక ఈ కేసులో అత్యాచార ఆరోపణలు వచ్చిన నీరజ్ సహాయ్, నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ, గత రాత్రి థానే లో పట్టుబడ్డాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నీరజ్ తో పాటు మరో ముగ్గురు ప్రొఫెసర్లనూ గత నెలలో సస్పెండ్ చేసినట్టు ఇనిస్టిట్యూట్ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.