ఇండియాలోనే శరవేగంగా పరిగెత్తుతుందన్న ప్రచారం, ఆపై ఎయిర్ హోస్టెస్ ల తరహాలో రైల్ హోస్టెస్ లు... మూడు రంగుల వర్ణంలో శోభాయమానంగా కనిపిస్తున్న రైలు. ఇంకేముంది! ఈ రైలెక్కిచూద్దాం అనుకొంటూ, 200 కిలోమీటర్ల ఢిల్లీ - ఆగ్రాల మధ్య ప్రయాణానికి రూ. 1500 పెట్టి టికెట్ కొనుక్కొని ఎక్కిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది.
ప్రయాణ కిక్కు దక్కకపోగా, ఈ మార్గంలో వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఆదా చేసింది. ఈ రూట్లో ప్రయాణించే శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో రూ. 1010 (ఏసీ ఎగ్జిక్యూటివ్) టికెట్ ధర ఉండగా, గతిమాన్ లో ఇదే క్లాస్ సీటుకు రూ. 1500 చెల్లించుకోవాలన్న సంగతి తెలిసిందే. 7 నిమిషాల కోసం 50 శాతం అధికంగా చెల్లించడం వృథా అని రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.
కాగా, తొలి రోజు రైలు ప్రయాణంలో స్పానిష్ ఆమ్లెట్, కేక్స్, గోధుమ ఉప్మా, ఆలూ కుల్చా, కంజీవరం ఇడ్లీ, మినీ దోశ, చికెన్ రోల్స్, స్విస్ రోల్స్ వంటి వెరైటీ ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారంట. ఈ విషయంలో మాత్రం ప్రయాణికులు ఖచ్ఛితంగా మెచ్చుకుంటారని సంబంరపడుతోంది రైల్వేశాఖ.