అతిథి దేవోభవ అన్న సూక్తికి మచ్చ తెచ్చేలా ఓ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటైన పుష్కర్ ను సందర్శించాలని వచ్చిన ఓ స్పెయిన్ యువ జంటకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఓ హోటల్ లో దిగిన జంట, బైక్ ను అద్దెకు తీసుకుని వ్యాహ్యాళికి వెళ్లింది. ఆ సమయంలో కొందరు స్థానికులు అటకాయించి వారిని వేధించారు.
యువతి బట్టలు చించి దాడి చేశారు. యువకుడిని రాళ్లతో కొట్టారు. గాయాలపాలైన వారిని హోటల్ మేనేజర్ అజ్మీర్ ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర భయాందోళనలో ఉన్న సదరు మహిళ స్టేట్ మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, మద్యంతాగిన కొందరు స్థానికులే ఈ దురగతానికి పాల్పడినట్లు ఎస్పీ నితిన్ దీప్ తెలిపారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది వైద్యపరీక్షల అనంతరం నిర్థారించుకుంటామని ఆయన అన్నారు. గాయపడ్డ స్పెయిన్ యువకుడి, ఆ మహిళను విచారించి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.