కోయంబత్తూర్ నుంచి చెన్నైలోని కాట్టుపల్లి హార్బర్ కు వచ్చిన ఒక గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి ఉండటాన్ని భద్రతా దళాలు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాట పలు నగరాల హిట్ లిస్టులో ఉండటంతో పోలీసులు ఏ చిన్న విషయాన్నీ చూసీ చూడనట్టు వదలటం లేదు. ఆమె తీవ్రవాదా కాదా అన్న అనుమానంతో విచారణ కూడా చేపట్టారు. అంతకు ముందే ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రానికి సమీపంలో కాట్టుపల్లి వైపుగా వెళ్తున్న ఈ గూడ్స్ లోని ఓ బోగీలో యువతి దాక్కొని ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకొని పొన్నేరి డీఎస్పీ శేఖర్ విచారిస్తున్నారు. ఆ యువతి పేరు స్టాన్లీ (21) అని, ఆంధ్రప్రదేశ్ వాసి అని సమాచారం. అయితే, భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఆమె రైలులోకి ఎలా ప్రవేశించిందన్నదే పెద్ద ప్రశ్న. పూర్తి వివరాలు విచారణ తర్వాతే తెలుస్తాయి.