హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులపై అటెండర్ కాల్పులు జరపడమనే ఓ భయానక సంఘటన బెంగుళూరులో జరిగింది. తుపాకితో కాల్పులు జరిపేంతటి కారణమేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఒకటి కాదు రెండు కాదు బుల్లెట్లు కురిపించాడా దుర్మార్గుడు. బెంగళూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులపై ఆ కాలేజీ అటెండర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని మరణించగా మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని కాడుగూడి ప్రాంతంలో గల ప్రగతి స్కూల్‌లో గౌతమి (17), శిరీష (17)లు పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న వారిపై అటెండర్ మహేశ్ (40) మంగళవారం రాత్రి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థినుల తలలకు తీవ్రగాయాలవడంతో గౌతమి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, శిరీష మృత్యువుతో పోరాడుతోంది. మణిపాల్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్హాన్స్ కు తరలించారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి జార్జ్, నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి పరిశీలించారు. నిందితుడు తన సోదరి ఇంట్లో తలదాచుక్నుట్లు సమాచారమందడంతో దాడి చేసి అరెస్టు చేసినట్లు డీసీపీ రోహిణి తెలిపారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి ఆ తుపాకీ ఎక్కడి నుంచి లభించిందో విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అమ్మాయిపై దాడి అనగానే ఇది ప్రేమ వ్యవహారం అంటూ పనిగట్టుకుని పుకార్లు పుట్టించే జనాలకు గౌతమి తండ్రి ముందుగానే ’ఇది ప్రేమ వ్యవహారం మాత్రం కాదు. దయచేసి అలాంటి పుకార్లు పుట్టించవద్దని’ పత్రికలకు, మీడియాకు విన్నవించుకున్నారట.