కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు గనక సెలవు పెడితే అంతే. ఏదైనా కారణం చేత జనవరి 1న సెలవు పెట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తప్పదు. ఒకరోజు వేతనం కోల్పోవడమే కాక ఏకంగా వేతన పెంపులో కూడా ఇతర ఉద్యోగుల కంటే వెనుకబడిపోతారు. 2016, జనవరి 1 నుంచి వేతన సవరణను అమలు చేయాలని ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల పెంపుకు సరేనంది. ఈ సందర్భంగా జారీ చేసిన నోటిఫికేషన్ లో వేతన సవరణ అమల్లోకి వచ్చే నాడు (జనవరి 1, 2016) విధులకు హాజయ్యే వారికి మాత్రమే వేతనాలు పెరుగుతాయని కేంద్రం విస్పష్టంగా పేర్కొంది.
ఏదేనీ కారణాలతో నేడు సెలవు పెట్టే ఉద్యోగులు తిరిగి వారు విధుల్లో చేరిన రోజు నుంచే వేతనం పెరుగుతుందని కూడా స్పష్టం చేసింది. దీంతో నేడు విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వేతన సవరణ నేటితోనే అమలవుతుంది. అదే, నేడు సెలవు పెట్టి రేపు తిరిగి విధుల్లోకి వచ్చే ఉద్యోగులకు రేపటి నుంచి వేతన సవరణ అమల్లోకి వస్తుంది. అంటే, నేడు విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగులు ఒకరోజు వేతనం కోల్పోవడంతో పాటు వేతన సవరణలోనూ నష్టపోతారన్న మాట.