వివాహ వేడుక వైభవంగా జరుగుతున్న శుభవేళ, అనుకోని ట్విస్ట్. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోని ఘటన ఇది. మరి కాసేపట్లో తాళి కట్టాల్సిన వరుడిని, ఒకమ్మాయి నలుగురి ముందు ఎడాపెడా వాయించేసరికి, తొలుత ఖిన్నురాలైనా, ఆపై జరగిన సంగతి తెలుసుకొని, వరుడికి హ్యాండిచ్చి అతడి సోదరుడి చెయ్యి పట్టుకుని ఏడడుగులు వేసిన వధువు కథ ఇది. ఈ ఘటన హరిద్వార్ సమీపంలోని అవడిపుర్హాల్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... వివాహ మండపంలోకి ఒక యువతి బాంబులా దూసుకొచ్చింది. వరుడిని పట్టుకుని చెంపలు వాయించింది. చుట్టుపక్కల వారు ఆమెను ఆపి విషయం ఆడగ్గా... తాను వరుడి మాజీ గర్ల్ ఫ్రెండ్ నని, ఎన్నో సంవత్సరాల నుంచి తామిద్దరికీ సంబంధం ఉందని చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆపై అక్కడ మరో కథ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పెళ్లాడనని వధువు భీష్మించుకుని కూర్చుంది. ఆమె బాధను చూసిన బంధువులు, వరుడి తరపు వారిని వెళ్లిపోవాలని కోరారు. మాటా, మాటా పెరుగగా, పోలీసుస్టేషన్ కు వెళ్లాలనుకున్న ఇరువర్గాలు చివరికి పంచాయితీని ఆశ్రయించాయి. వరుడి తరపు వారు తమను క్షమించాలని కోరగా, కేసుల దాకా పోకుండా మధ్యేమార్గంగా వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని వధువుకు సూచించారు. ఈ సూచనకు వధువుతోపాటు కాబోయిన వరడి తమ్ముడు కూడా అంగీకరించటంతో పెళ్లి తతంగం పూర్తయ్యింది.