బక్కపల్చటి దేహం, పంచెకట్టు, చేతిలో కర్రతో తెల్ల దొరలను తరిమి కొట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడని మనమంతా ఆ మహత్ముణ్ణి జాతిపితగా కొలుస్తూ పూజిస్తున్నాం. అహింసనే ఆయుధంగా చేసుకుని రక్తం బొట్టు చిందకుండా ఆయన చేసిన త్యాగానికి విగ్రహాలు పెట్టి ఏటా నివాళులు కూడా అర్పిస్తున్నాం. కానీ, అలాంటి వ్యక్తిని హతమార్చిన గాడ్సే ను ప్రస్తుతం దేవునిగా భావించి పూజిస్తున్నారు మనదేశంలోనే కొందరు వ్యక్తులు. గాడ్సేను ఉరి తీసిన రోజు నవంబరు 15ను బలిదాన్ దివస్ గా అఖిల భారతీయ హిందూ మహాసభ జరుపుకుంది. అంతేకాదు గాడ్సే పేరిట 'నాథురాం గాడ్సే- ఏ ఫర్గాటెన్ హీరో' పేరిట ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది కూడా. ఈ వెబ్ సైట్ లో గాడ్సేకు సంబంధించిన గొప్ప గొప్ప విషయాలంటూ కొన్నింటిని పేర్కొంది. అంతేకాదు గాడ్సే తోపాటు అతని సోదరుల రచనలను అందుబాటులో ఉంచారు.
గాడ్సే నిజానికి ఓ తీవ్రవాది కాదట. అతడు దేశానికి ఓ దేవుడి లాంటి వాడని వారంతా పేర్కొంటున్నారు. అంతేకాదు గాడ్సే పేరిట హిందూ మహా సభ కార్యాలయాల్లో యాగాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ మున్నాకుమార్ మాట్లాడుతూ, ‘దేశ విభజనకు గాంధీ కారణమయ్యాడనే కారణంతో గాడ్సే ఈ హత్యకు పాల్పడ్డాడు. గాంధీ బ్రతికుంటే భవిష్యత్తులో దేశం ఇంకా ముక్కలవుతుందని గాడ్సే గ్రహించాడు’ అని తెలిపారు. గాడ్సే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్న డిమాండ్ తో రాష్ట్రపతికి త్వరలో వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా హిందుత్వవాదానికి చెందిన ఓ సంస్థ గాంధీ హంతకుడికి ఇంత ఘనంగా నివాళులర్పించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.