ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ బ్యాంక్ దొపిడీకి ప్రయత్నించిన ఒక దొంగ రాసిన క్షమాపణ ఉత్తరం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం రాత్రి సదరు దొంగ కెనరా బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. నగదు, ఆభరణాలన్నీ స్ట్రాంగ్ రూంలో ఉండటంతో బద్దలు కొట్టడం అతనికి శక్తికి మించిన పని అయ్యింది. దీంతో చేసేది లేక ఉత్త చేతులతో వెనుదిరిగాడు. అయితే ఏమనిపించిందో ఏమో గానీ మనోడు బ్యాంక్ లోని ఓ చైర్లో కూర్చోని లెటర్ హెడ్ పై తన గోడును వెల్లబోసుకున్నాడు. ‘‘క్షమించాలి... మీ కుర్చీలో కూర్చోని మీకే ఉత్తరం రాస్తున్నా. నాకు పిల్లలున్నారు. ధరలు పెరిగిపోయాయి. నా ప్రైవేట్ ఉద్యోగం కూడా ఊడింది. అందుకే ఈ దొంగతనానికి ప్రయత్నించా’’ అని రాశాడు. ఉదయం సిబ్బంది వచ్చే చూసేసరికి బ్యాంక్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. జాగిలాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం వెతుకుతుండగా లేఖ దొరికింది. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు ధీమాగా చెబుతున్నారు.