ఢిల్లీ నెలలో 29 రోజులు బంద్?

December 11, 2015 | 11:43 AM | 3 Views
ప్రింట్ కామెంట్
If_Delhi_Beijing_it_would_shut_29_of_30_days

దేశ రాజధాని ఢిల్లీలో ఉండటమంటే గ్యాస్‌ ఛాంబర్‌లో ఉన్నట్లే, ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు ఢిల్లీ హైకోర్టు. దేశరాజధానిలో పరిస్థితి నిజంగానే అంత దారుణంగా ఉంది.  వేగంగా పెరిగిపోతున్న కాలుష్యం, నగర వాసులను నరకానికి చేరువ చేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి కావడం కాదు కదా రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. రాను రాను కాలుష్యం మరింత డేంజర్ లెవల్ కి చేరుతుంది. ఇలా మరికొన్ని రోజులు బిజీంగ్ లో ఇప్పుడు కొనసాగే పరిస్థితులు ఢిల్లీలో కొనసాగుతాయి. చైనా రాజధాని బీజింగ్ లో ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ పనులకు అక్కడి ప్రభుత్వం కొంత విరామం ఇచ్చింది. కాలుష్య తీవ్రత మానవ ప్రాణాలను హరించే స్థాయికి చేరుకోవటమే అక్కడి సెలవులకు కారణం. ఇక ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఏర్పడితే, నెలంతా స్కూళ్లు, ఫ్యాక్టరీలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ పీస్ ఇండియా విశ్లేషణ ప్రకారం... ఢిల్లీలో వాయు నాణ్యత, ప్రస్తుతం బీజింగ్ లో తగ్గినంత స్థాయికి చేరితే నవంబర్ నెలలో ఉన్న 30 రోజుల్లో 29 రోజుల పాటు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) గణాంకాలను, ప్రస్తుత వాయు కాలుష్యాన్ని, చైనాలో వాయు కాలుష్యాన్ని పరిశీలించి గ్రీన్ పీస్ ఈ వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్, నవంబర్ మధ్య 91 రోజుల్లో 33 సార్లు ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిందని, ఇదే సమయంలో లక్నోలో 40 సార్లు కాలుష్యం పెరిగిందని, ఢిల్లీతో పాటు మరిన్ని నగరాల్లో ప్రమాదం పెరుగోందని హెచ్చరించింది. ఢిల్లీలో నెలలో 29 రోజులు, ముజఫరాపూర్ లో 26 రోజులు, వారణాసిలో 23 రోజులు, పాట్నాలో 22 రోజులు, కాన్పూర్, ఫరీదాబాద్ లలో 21 రోజులు వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిని దాటిందని వెల్లడించింది.  ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీజింగ్‌ లో అమలు చేసే కఠిన నిబంధనలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సరి-బేసి వాహనాలు రోజు విడిచి రోజు తిరగాలన్న నిబంధన అందుకే తీసుకొచ్చింది. అది కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే.

                          అయితే అమలు సాధ్యం కాని నిబంధనలు తీసుకొస్తున్నారని గత కొన్ని రోజులుగా విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఎంపీ, ఎమ్మెల్యేలకు లేని నిబంధనలు మాకెందుకని సాధారణ పౌరులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు కూడా కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. పబ్లిసిటీ కోసమే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని ఆరోపించింది. దేశ రాజధాని భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కావటంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మరో బిజీంగ్ లా మారకముందే ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ