దేశ అత్యున్నత న్యాయస్థానం నోటి వెంట భారత రాజకీయ వ్యవస్థపై పెను ప్రభావం చూపే వ్యాఖ్యలు వచ్చాయి. కనీస విద్యార్హతలు లేని వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే తప్పేంలేదని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్థానిక ఎన్నికల్లో కనీస విద్యార్హతలను సూచిస్తూ, హర్యానా సర్కారు నిర్ణయం తీసుకోగా, దాన్ని సవాలు చేస్తూ, పలువురు సుప్రీంను ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే, పురుషులు 10వ తరగతి, స్త్రీలు 8వ తరగతి, దళితులు 5వ తరగతి చదవడం తప్పనిసరని హర్యానా సర్కారు జీవోతేగా, ఇవి అమలైతే 20 ఏళ్లు నిండిన 83.06 శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ పడే అర్హత కోల్పోతారని పలువురు కోర్టుకెక్కారు.
పిటిషన్ ను విచారించిన ధర్మాసనం, హర్యానా నిర్ణయాలను నిలుపి వేస్తూనే కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలు తమ అభిప్రాయమేనని, ఎన్నికల్లో పాల్గొనే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దాన్నెవరూ కాదనలేరని చెబుతూ, హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నవారే ఎన్నికల్లో పోటీకి అర్హులన్న హర్యానా మరో నిర్ణయంపై కూడా సుప్రీం స్టే విధించింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ నిర్ణయాలు అమలవుతాయని భావిస్తున్నట్లు, అందుకు తొలి అడుగు రాజకీయ పార్టీల నుంచి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం చెప్పింది అమలయితే మాత్రం దేశ రాజకీయాలు సమూలంగా మారిపోతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.