కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక వివాహా మహోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన కుటుంబంతో సహా ఇండియన్ నేవీ హెలికాప్టర్ లో ప్రయాణించటం ప్రస్తుతం వివాదాస్పదమయ్యింది. డిసెంబర్ 23న జరిగిన ఒక వివాహానికి ఇండిగో ఫ్లైట్ లో భార్య సంగీత, కుమార్తె సోనాలీలతో సహా గోవా చేరుకున్న అరుణ్ జైట్లీ అక్కడ నుండి వివాహా వేడుక జరుగుతున్న కోనాకోనా రిసార్టు చేరుకోవడానికి భారత నావికాదళ హెలికాప్టర్ ను వినియోగించారు. ఇక జైట్లీ అధికార దుర్వినియోగంపై గోవాకు చెందిన న్యాయవాది ఐరిస్ రోడ్రిగ్జ్ నేరుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. గుడ్ గవర్నన్స్ డే ప్రకటించిన ప్రభుత్వ హాయాంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం వారికి మచ్చ తెస్తుందని, అలాగే దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ విషయంలో 15 రోజుల్లోగా చర్యలు తీసుకోలేకపోతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పనిలోపనిగా బెదిరించాడు కూడా. మరి ఈ అంశంపై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.