ఆస్ట్రేలియా భారత్ మూడో టెస్ట్. భారత ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్... మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో కోహ్లి ముందుకొచ్చి నేరుగా షాట్ ఆడాడు. దానిని అందుకున్న జాన్సన్, కోహ్లిని రనౌట్ చేసేందుకు స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే అది నేరుగా కోహ్లి వీపును తాకింది. వెంటనే ఆసీస్ బౌలర్ ‘సారీ’ చెప్పాడు. మరొకరైతే జాన్సన్ క్షమాపణను స్వీకరించేవారేమో! కానీ అలా చేస్తే అతను కోహ్లి ఎందుకవుతాడు? వెంటనే ప్రత్యర్థితో వాదనకు దిగాడు. ఈసారి స్టంప్ వైపు విసిరేందుకు ప్రయత్నించు. నా శరీరంపై కాదు అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నా ఉద్దేశ్యం కూడా చెప్పాలి కదా. మైదానంలో అర్థంపర్థం లేని మాటలు నేను మాట్లాడను. క్రికెట్ ఆడటం కోసం క్రీజులో ఉన్నాను. నాకు తగిన మర్యాద ఇవ్వని ఆటగాడికి నేను కూడా ఎలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం గానీ, కారణం గానీ లేదు’ అని జాన్సన్ గురించి వ్యాఖ్యానించాడు. ‘ఆసీస్ ఆటగాళ్లు నన్ను చెడిపోయిన పిల్లాడు అన్నారు. నేను నిజంగా అలాంటివాడినేమో. వారు నన్ను ద్వేషించడమే నాకిష్టం. నన్ను ఎన్ని మాటలు అన్నా అది నాకే లాభించింది. నా అత్యుత్తమ ప్రదర్శన బయటపడింది. అయినా వారు మారరు’ అని కోహ్లి చెప్పాడు. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉండటం వల్లే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 1-1తో సమంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించిన కోహ్లి, భారత్‌లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావెందుకో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే చివరకు జాన్సన్ బౌలింగ్‌లోనే కోహ్లీ వెనుదిరగడం కొసమెరుపు. తన బౌలింగ్‌లో కోహ్లి విరుచుకుపడ్డ తీరు బహుశా జాన్సన్‌కు ఆగ్రహం తెప్పించి ఉండోచ్చు అది సహాజం. అయితే తన ఆట ద్వారానే భారత స్టార్ బదులివ్వాలి గానీ మాటల ద్వారా కాదంటున్నారు క్రికెట్ పెద్దలు. భవిష్యత్ కెప్టెన్ గా నిలవాలంటే ఆవేశాన్ని అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు.