ఎవరైనా కుక్కలని పెంచుకుంటారు... పిల్లుల్నిపెంచుకుంటారు. ముద్దు మరీ ఎక్కువైతే పిట్టల్ని పెంచుకుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లో ఓ మహిళా మంత్రికి వెరైటీ ఆలోచన వచ్చింది. ఇంతకు ఆమె ఏం పెంచుకోవాలనుకుంటుదనేగా మీ అనుమానం. ఏం లేదులేండీ... ఆవిడగారికి ఓ పెద్దపులిని పెంచుకోవాలన్న ఆలోచన వచ్చిందట. కుసుమ్ మెహ్ దెలే అనే మహిళా మంత్రికి ఓ పులిని పెంచుకోవాలని అనుకుంటున్నానని చెబుతోంది. థాయ్ లాండ్ లాంటి కొన్ని ఆసియా దేశాల్లో పులులను పెంచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, మన దేశంలో అలాంటి వాటికి అనుమతించరు కదా. ఇక దీనికోసం ఆమె గత సెప్టెంబర్ లోనే కేంద్ర అటవీశాఖకు లేఖ రాసింది. అయితే దీని నుంచి ఎటు వంటి స్పందన రాలేదట. అజయ్ దూబే అనే ఉద్యమకారుడు ఈ విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. పులులు పెంచుకునేందుకు అక్కడ(థాయ్ లాండ్) ఎటువంటి అనుమతులు అవసరం లేదని. పైగా ఇలాంటి చర్యల వల్లే అక్కడ పులుల సంఖ్య విపరీతంగా పెరిగిందని కుసుమ్ చెబుతోంది. మనదేశంలో కూడా ఈ తరహా చట్టాలు తెస్తేనే వాటి సంఖ్యను పెంచవచ్చునని సలహా ఇస్తోంది. పులులను, సింహాలను పెంచుకునేందుకు ప్రజలకు అనుమతివ్వాలని, ఇందుకోసం తగిన చట్టాలు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరుతోంది.