పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సెలబ్రిటీల సాయం తీసుకుంటోంది. ఇప్పటికే అమితాబ్, అమీర్, రేఖ వంటి వారు ఈ జాబితాలో చేరగా, తాజాగా, కేంద్ర ప్రభుత్వ తాజా పథకం ‘బేటీ బచావో... బేటీ పడావో’ ప్రచార అంబాసిడర్ గా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఎంపికైంది. ఈ మేరకు మాధురీ తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. సామాజిక కార్యక్రమంలో పాలుపంచుకోవటం సంతోషంగా ఉందని పేర్కొంది. కాగా, ప్రధాన మంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని గురువారం హర్యానాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. శిశువుల లింగ నిష్పత్తి మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది. మహిళా శిశు సంక్షేమం, మానవవనరుల, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఈ పథకాన్ని ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. మొదటి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద జిల్లాలో ఈ పథకం అమలుకానుంది.