అనుమానం అనే పెను భూతం కాపురాల్లో పెట్టే చిచ్చు గురించి తరచూ మనం వార్తల్లో చదువుతుంటాం. పరాయి వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడినా, మెలిగిన రగిలిపోయే భర్తలు పెళ్లాలపై అనుమానం పెంచుకుని హింసించడాలు, అవసరమైతే ఘోరాలకు పాల్పడటం కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడో భర్త కాస్త వెరైటీగా స్పందించాడు. తన భార్య పనిచేసే ఆఫీసులో పనిచేసే ఓ కొలిగ్ ఆమెతో చనువుగా ఉంటున్నాడని ఆయనగారికి తెలిసింది. అయితే అందరిలా తన భార్యను చిత్రహింసలు చెయ్యలేదు. ఆ చనువుగా ఉంటున్న వ్యక్తిని బెదిరించడానికి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు.
బెంగళూరు రేస్ కోర్స్ రోడ్డులో బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కాం)లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక వ్యక్తి. అక్కడే ఉద్యోగం చేస్తున్న మహిళతో ఆయన చనువుగా ఉంటున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త మనసు గాయపడింది. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ వ్యక్తి కి బుద్ధి చెప్పాలని ప్లాన్ వేశాడు. రెండు విషపు సర్పాలతో అతగాడికి ఓ కొరియర్ ను పార్సల్ చేశాడు. పాములు గాలి పీల్చుకునేందుకు వీలుగా దానికి రంధ్రాలు పెట్టాడు. తరువాత కొరియర్ లో ఆ పాములను ఆయనకు పంపించాడు. ఆ వ్యక్తి బాక్స్ తీసి చూసే సరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పని అయ్యింది. బాక్స్ లోపల రెండు పెద్ద పాములు ఉన్నాయి. పాములు బుసలు కొట్టడంతో కార్యాలయం సిబ్బంది హడలిపోయారు.
అంతేకాదు తన భార్యతో చనువుగా ఉండటం మానకపోతే చావు తప్పదని హెచ్చరిస్తూ ఓ లేఖను కూడా పెట్టాడు. అంతేకాదు... కాస్త దూరంగా ఉండి ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మంచిది అంటూ దానిపై వార్నింగ్ లేఖ కూడా రాసి పెట్టాడట ఆ భర్త గారు. ఇక ప్రాణహానితో వణికిపోయిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.