పవిత్ర గంగా నది నీరు కలుషితం అవుతున్నా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఇలాంటి ప్రక్షళణ పథకం చేపట్టలేదు. మోదీకి నదులపై ఉన్న పవిత్ర భావం వల్ల ఈ పథకం చేపట్టారు. ’నమామి గంగే’ కు కేంద్ర కేబినెట్ ఏకంగా 20 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. గంగానదీ ప్రక్షాళనకు గత మూడు దశాబ్దాలలో వ్యయం చేసిన మొత్తానికి దాదాపు నాలుగు రెట్ల నిధులను వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రూ.462 కోట్ల వ్యయంతో గంగా కార్యాచరణ పథకానికి శ్రీకారం చుట్టారు. గత 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుపై వివిధ ప్రభుత్వాలు ఇంతవరకు దాదాపు రూ.4,000 కోట్లు ఖర్చు చేశాయి. ఈ పథకాన్ని రాష్ట్రస్థాయి కార్యక్రమ నిర్వహణ బృందాల సహకారంతో స్వచ్ఛ గంగకు సంబంధించిన జాతీయ మిషన్(ఎన్‌ఎంసీజీ) అమలుపరుస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో గంగా కార్యాచరణ ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వని దృష్ట్యా, ప్రస్తుత ప్రాజెక్టులో జరిగే నిర్మాణాలను కనీసం పదేళ్లపాటు పనిచేసేలా, నిర్వహణకు బాధ్యత వహించేలా చేయాలనీ, నదిలోకి కాలుష్యం అధికంగా జరిగే ప్రాంతాల వద్ద పీపీపీ/ఎస్పీవీ నమూనాలలో పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.