స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త మదన్ మోహన మాలవ్య, బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిలకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. అయితే వీరిద్దరితోపాటు మరో స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూ కూడా భారత రత్న ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందట. అయితే ఆ మహోన్నత పురస్కారాన్ని నేతాజీ తరపున స్వీకరించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవటంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. నేతాజీ మరణం వెనుక మిస్టరీ అలాగే ఉంది. అలాగని బతికే ఉన్నారని చెప్పేందుకూ నిదర్శనం లేదు. అయితే నేతాజీ మాత్రం ఎక్కడో జీవించే ఉన్నారని, ఏదో ఒక రోజు ఆయన తిరిగి వస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన బతికుండగా ఆయన తరపున పురస్కారాన్ని ఎలా స్వీకరిస్తామని వారు ప్రశ్నించటంతో కేంద్రం వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.