అత్యాచార కేసుల్లో సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారాలే కాదు, కేసుల్లో నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా అది నేరమే అవుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది. తాజాగా తమిళనాడులో ఓ మైనర్ రేప్ కేసులో మైనర్ బాధితురాలిని నిందితుడితో రాజీ పడాలని మద్రాస్ హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. నిందితుడు తన ఆస్తి మొత్తం ఇచ్చిన అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోనని, దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమౌతానని ఆ యువతి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజీ పడటమే కాదు, అలా సూచించటం కూడా తప్పేనని సుప్రీం వ్యాఖ్యానించటం విశేషం. రాజీ పడాలని చెప్పటం మహిళల హక్కులను కాలరాయటమే అని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.