ఓ మతం పట్ల ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేసిన కేసులో ఏడుగురిని యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విపుల్ సింగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అతని ఫేస్ బుక్ లో ఒక మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. వాటికి అతని స్నేహితులు అరుగురు లైక్ లు కూడా కోట్టారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక బీఎస్ పీ నాయకుడు ఒకరు తమ మతాన్ని కించపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు తన అనుచరులతో కోత్వాలి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్నఅసిస్టెంట్ పోలీసు కమిషనర్ దినేష్ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించి విషయం తెలుసుకున్నారు. వెంటనే విపుల్ సింగ్ మీద కేసు నమోదు చెయ్యాలని దినేష్ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన విపుల్ సింగ్ తో పాటు మరో ఆరు మందిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. విపుల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో శివసేన అధినేత బాల్ థాక్రే చనిపోయినప్పుడు ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యువతితోపాటు, లైక్ కొట్టిన ఆమె స్నేహితురాలిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.