వేల కోట్లు కళ్ల ముందే తగలడిపోయాయి. మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లో వేల కోట్ల విలువ చేసే కరెన్సీ నోట్లను దగ్ధం చేశారు. రూ.30వేల కోట్ల విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లు తప్పుగా ప్రింట్ చేయడంతో అధికారులే వాటిని కాల్చి బూడిద చేశారు. దాంతో నోట్ల ముద్రణకు ఉపయోగించే దాదాపు 50 టన్నుల పేపర్ వేస్ట్ అయింది. ఈ నోట్ల ముద్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఆపరేటర్లపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.
నోట్లలో ఉండాల్సిన వెండి రంగులో మెరిసే సెక్యూరిటీ థ్రెడ్ ఈ నోట్లలో లేకపోగా.. మరి కొన్ని నోట్లలో గాంధీ బొమ్మను ఏకంగా తలక్రిందులుగా ముద్రించారట. నోట్ల ముద్రణలో తప్పులు జరిగాయన్న సమాచారాన్ని చేరవేసేందుకు ఆర్బీఐ అధికారులు ఆర్బీఐ కార్పోరేట్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి ఆల్పనా కిల్లావాలాకు ఈ విషయం చెప్పేందుకు ఫోన్ చేయగా.. అయన ఫోన్ అప్పటికే ఆఫ్ చేసి ఉందనీ, అప్పటికే ఆలస్యం కావటంతో ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని ముద్రణ కేంద్రానికి చేరవేసే లోగా మరికొన్ని నోట్లు ముద్రించబడ్డాయనీ అధికారులు చెప్తున్నారు.
కనీసం ఆలస్యంగానైనా తప్పులను గుర్తించిన అధికారులు.. ముద్రణ నిలిపివేసి, తప్పును సరిదిద్దేపనిలో పడ్డారు. 1924లో నాసిక్ లో భారత కరెన్సీ నోట్లను ముద్రించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కేంద్రం కొనసాగుతూనే ఉంది. దేశంలోని ముఖ్య నగరాలకు ఇక్కడి నుంచి రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉండటం, యేడాదంతా వాతావరణం అనుకూలంగా ఉండటం వంటి కారణాలతో ఈ ముద్రణ కేంద్రాన్ని నాసిక్ లో నిర్మించారు.