సైనిక దుస్తులు, ప్రభుత్వ వాహనంతో ఉగ్రవాదులు

January 02, 2016 | 12:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pathankot-terror-attack-niharonline

పంజాబ్ లోని భారత కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి తెగబడిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుగా తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది నిలువరించారు. దీంతో కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. తాజా సమాచారం మేరకు మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో నలుగురు హతమైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. పరిస్థితిని అంచనా వేసిన ఉన్నతాధికారులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), గరుడ కమాండో ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే, ఉగ్రవాదుల మెరుపు దాడిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా చనిపోయారు.

పక్కా ఫ్లాన్ ఎలా ఉందంటే...

రెండు రోజులకు ముందుగానే పాక్ సరిహద్దు జిల్లాలు పఠాన్ కోట్, గురుదాస్ పూర్ జిల్లాల్లోకి ఐదారుగురు ఉగ్రవాదులు చొరబడ్డట్టు తెలుస్తోంది. భారత భూభాగంలోకి ఎంటర్ కాగానే, భారత సైనిక దుస్తుల్లోకి మారిపోయిన ఉగ్రవాదులు అటు వైపుగా వచ్చిన గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కిడ్నాప్ చేశారు.

గురువారం రాత్రి తన జూనియర్ పోలీసు అధికారితో కలిసి పఠాన్ కోట్ లోని ఓ గురుద్వారాలో ప్రార్థన చేసేందుకు సల్వీందర్ సింగ్ వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సైనిక దుస్తుల్లో రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ ఉగ్రవాదులు ఆయన కారును అటకాయించారు. కారు ఆగీఆగగానే అందులోకి చొరబడ్డారు. ఓ ఉగ్రవాది డ్రైవర్ సీటును ఆక్రమించగా, ఎస్పీతో పాటు ఆయన జూనియర్ అధికారిని కూడా ఉగ్రవాదులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారిద్దరిని వదిలేసి కారుతో ముందుకు దూసుకెళ్లారు. అప్పటికీ కారులోనే ఉన్న సల్వీందర్ సింగ్ సహాయకుడిని గొంతు కోసిన ఉగ్రవాదులు వేగంగా వెళుతున్న కారు నుంచి కిందకు తోసేశారు. దీనిని గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇక పఠాన్ కోట్ కు 35 కిలో మీటర్ల దూరంలో ఎస్పీ కారును వదిలేసి అటుగా వచ్చిన మరో వ్యక్తి కారును అపహరించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిని ఉగ్రవాదులు చంపేశారు. ఆ తర్వాత సైనిక దుస్తుల్లోనే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ఉగ్రవాదులు అక్కడే మకాం వేసి అదను చూసి నేటి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. అయితే రాత్రి సమయంలోనూ అప్రమత్తంగా ఉండే భారత సైన్యం ముందు పాక్ ఉగ్రవాదుల పప్పులు ఉడకలేదు. వేగంగా స్పందించిన భద్రతా దళాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ