‘మహా’ కష్టాల కడలిలో రైతన్న

December 02, 2014 | 10:29 AM | 19 Views
ప్రింట్ కామెంట్

కృషివలుని కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశానికి వెన్నెముక లాంటి రైతన్న కష్టాల కడలిని ఈదలేక తనకు తానుగా చితిని పేర్చుకొని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. రైతుల వెతలను తెలియజేసే ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రైతు ఆత్మహత్యలకు ప్రసిద్ధి గాంచిన విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లాలో ఉన్న మానర్ఖేడ్ గ్రామంలో కాశీరాం భగవాన్ ఇందారె అనే 75 ఏళ్ల రైతు ఉండేవాడు. తనకున్న ఎకరం భూమిలో ఈ సంవత్సరం పత్తి, సోయాబీన్ పంటలు వేశాడు. కరువు రక్కసి ఆ పంటలను ఘోరంగా దెబ్బతీసింది. దీంతో భగవాన్ తట్టుకోలేకపోయాడు. తన బాధను, నిస్సృహను భార్యతో పలుమార్లు పంచుకున్నాడు. సొంత పొలంలోనే స్వయంగా చితిని పేర్చకుని నిప్పంటించుకుని తనువు చాలించాడు. ఈ దయనీయమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భగవాన్ రాత్రి ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు కాలిన స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గత 50 రోజుల్లో విదర్భ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 42వ రైతు కాశీరాం భగవాన్. విదర్భ ప్రాంతంలోని కరవు పీడిత ఆరు జిల్లాల్లో గత పదేళ్లలో దాదాపు 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఒక్క నవంబర్ నెలలోనే విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో దాదాపు 120 మంది రైతులు చనిపోయారని విదర్భ జన ఆందోళన సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. గత 24 గంటల్లోనే దాదాపు 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సగటున రోజుకు నలుగురు చనిపోతున్నారని ఆవేదనతో చెప్పారు. పత్తి, సోయాబీన్ రైతులే ఎక్కువగా ఈ దారుణానికి ఒడిగడుతున్నారన్నారు. కరవు కారణంగా దాదాపు 50 లక్షల హెక్టార్ల పంట నాశనమైందని చెప్పారు. నష్ట పరిహారంగా రూ. 60 వేల కోట్లు అవసరముండగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కేవలం రూ. 4 వేల కోట్లు కేంద్రసాయాన్ని కోరడాన్ని తివారీ తప్పుబట్టారు. ఇక అన్నదాతల ఆత్మహత్యలలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ, కర్ణాటకలు టాప్ ప్లేస్ లలో ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ